రాజశేఖరుడికి ఘన నివాళి / Sep 04 09 |
హైదరాబాద్: దురదృష్టవశాత్తూ... హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన బహుదూరపు బాటసారి.... జనం గుండెల్లో గూడుకట్టుకున్న జననేత.... ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రాష్ట్ర ప్రజానీకం ఘన నివాళులు అర్పిస్తోంది. సాధారణ పౌరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతోపాటు వైఎస్సార్‌కు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్ వచ్చారు. వైఎస్సార్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు ఇప్పటికే నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా వైఎస్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి సైనిక నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే వైఎస్ మరణవార్త విన్న కొందరు అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ మరణవార్తను తట్టుకోలేక గుండెపోటు, ఆత్మహత్యలతో 60 మందికిపైగా అభిమానులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ కుమారుడు జగన్ మాట్లాడుతూ.. అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి అఘాయిత్యాలకు, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పారు. తమ ప్రియతమ నేత తిరిగిరాని లోకాలకు వెళ్లారనే బాధతో ఎవరూ గుండె ధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని జగన్ అన్నారు. మరోవైపు వైఎస్సార్ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు లక్షలాది మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. |
0 comments:
Post a Comment