Sep 03 09 |
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం భారతదేశంలోనే ఇంత వరకు ఎన్నడూ జరగనంత అతి పెద్ద ఆపరేషన్ కర్నూలు జిల్లా ఆత్మకూరులో నిర్వహించారు. దాదాపు 24 గంటల తరువాత ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ శకలాలను, 27 గంటల తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మృతదేహాన్ని గుర్తించారు. భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్‌లు, కేంద్ర బలగాలు, అత్యంత ఆధునిక పరిజ్ఞానం కలిగిన సుఖోయ్ విమానం, నావికాదళం, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు, నల్లమల అడవుల్లోని గిరిజనులు వేలాదిగా వైఎస్‌ఆర్ ఆచూకీ కోసం విస్తృతమైన గాలించారు. గురువారం మధ్యాహ్నం జననేత వైఎస్ ఇకలేరన్న వాస్తవాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో అందరిలోనూ ఉత్కంఠ రేపిన వైఎస్‌ఆర్ ఆచూకి ఆపరేషన్ క్షణ క్షణం బుధవారం ఇలా గడిచింది. ఉదయం 8.20 గంటలు : చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బేగంపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు. 8.35 : బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో చిత్తూరుకు బయలుదేరారు. 9.15 : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌నుంచి చివరిసారిగా వైర్‌లెస్‌కు సమాచారం అందింది. 9.30 : హెలికాప్టర్ ప్రకాశం-కర్నూలు సరిహద్దుల్లోని రోళ్లపెంట సమీపంలో ప్రయాణిస్తున్నట్లు వైర్‌లెస్ సిగ్నల్స్ అందాయి. 9.35 : హెలికాప్టర్‌కు శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగం మధ్య అనుసంధానం పూర్తిగా తెగిపోయింది. 9.36 : రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ముఖ్య విభాగాలకూ, ముఖ్యమంత్రి వైఎస్ ఆత్మీయులకూ సమాచారం అందించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో సీఎం హెలికాప్టర్ మిస్ అంటూ వార్తలు రావడంతో రాష్టవ్య్రాప్తంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. 11.25 : సచివాలయంలో కేవీపీ రామచంద్రరావు, ముఖ్య కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్, ఇంటలిజెన్స్ ఛీఫ్ అరవిందరావుల సమావేశం. 12.00 : మీడియాలో భారీగా ప్రచారం కావడంతో సచివాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, ప్రముఖులు. 3.00 : సీఎం హెలికాప్టర్ మిస్సింగ్‌పై రకరకాల ఊహాగానాలు. కర్నూలు జిల్లాలో దిగారంటూ, చిత్తూరుకు రోడ్డుమార్గంలో వెళుతున్నారంటూ పుకార్లు. ప్రజల్లో ఎడతెగని ఉత్కంఠ. 3.05 : ముఖ్యమంత్రి క్షేమం అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం. 3.45 : ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య వెల్లడి. సీఎం బృందం ఆచూకీ కోసం వెదకాలని నల్లమల సమీప జిల్లాల ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి. 4.00 : రాష్ట్రంలో హై అలర్ట్. ముఖ్యమంత్రి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ రాష్టవ్య్రాప్తంగా ప్రార్ధనలు ప్రారంభం. 4.15 : ఐదుకు పైగా హెలికాప్టర్లతో ముమ్మరంగా కొనసాగిన గాలింపుచర్యలు. తేలని ఆచూకీ. రాత్రి 10.00 : ఏ మాత్రం దొరకని ఆచూకీ. జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రత్యేక విమానంతో గాలింపు. నల్లమల అడవుల ఫొటోల చిత్రీకరణ. 11.30 : ప్రత్యేక విమానం తీసిన 41 ఫొటోల్లో విలువైన సమాచారం లేదని నిర్థారణ. ప్రత్యేకంగా పంపిన సుఖోయ్ విమానంతో నల్లమలలో ఏరియల్ సర్వే. సెప్టెంబర్ 3 : గురువారం తెల్లవారుజామున 4.00 : గాలింపు కోసం సుఖోయ్ యుద్ధ విమానం రాక. గాలింపు ప్రారంభం. గంటలో పూర్తి. హెలికాప్టర్ శకలాల గుర్తింపు. ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం చేరవేత. 5.00 : సంఘటనస్థలం దిశగా సైనిక హెలికాప్టర్లతో ఉపరితల గాలింపు ముమ్మరం. 6.00 : సుఖోయ్ అందించిన సమాచారం మేరకు సంఘటన జరిగిన తీరును బట్టి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా మరో నలుగురు బయటపడే అవకాశాలు లేవని అంచనా. గురువారం తెల్లవారుజాము 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఉదయం 7-8 గ౦టల సమయంలో వైమానిక దళ కమాండర్ సాగర్ భారతి హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. 8.45 : కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న వెలుగోడుకు సమీపంలో రుద్రంకొండపై హెలికాప్టర్ శకలాల గుర్తింపు. 8.50 : ఆత్మకూరులో ఉన్న మంత్రులు సంఘటన జరిగిన రుద్రకొండ ప్రాంతానికి బయలుదేరారు.మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘవీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి తదితరులతో పాటు పలువురు నేతలు సంఘటనా స్థలానికి హుటాహుటిన తరలివెళ్లారు. 9.30 : దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని గుర్తించిన తరువాత హెలికాప్టర్ ఆ మేరకు కాగితంపై సంఘటనా స్థలాన్ని రాసి నేలపైకి జారవిడిచింది. దీంతో గాలింపు జరుపుతున్న పోలీసులు, ప్రజలు ఆ కాగితాన్ని పరిశీలించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. 9.50 : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా అందులో ప్రయాణిస్తున్న సీఎం కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ముఖ్య భద్రతాధికారి వెస్లీ, గ్రూప్ పైలెట్ భాటియా, కో పైలెట్ ఎం.సత్యనారాయణరెడ్డిలు మృతి చెందినట్లు ఢిల్లీలోని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడి. 10.00 : హైదరాబాద్‌తో సహా రాష్టవ్య్రాప్తంగా ప్రజల్లో అలజడి ప్రారంభం. 10.10 : గాంధీభవన్‌తో సహా ప్రతివీధిలోనూ సీఎం చిత్రపటాలతో సంతాప సభల ఏర్పాటు. 10.30 : సచివాలయానికి ప్రముఖుల రాక. ఉదయం 11.30 గంటలకు నడిచేదారిలో వెళ్లేందుకు వీలు కాక వెనుదిరిగిన మంత్రులు ఉదయం 12.30 గంటలకు ముఖ్యమంత్రి మృతి చెందారన్న సమాచారం. మధ్యాహ్నం 12.30: ముఖ్యమంత్రి మృతిపై ఆర్థిక మంత్రి రోశయ్య ప్రకటన. 1.30 గంటల వరకు ప్రయత్నించి సాధ్యం కాక, హెలికాప్టర్ల ద్వారా కిందకు దిగి మృతదేహాలను తాళ్లతో కట్టి తరలించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు భారత వైమానిక దళం హెలికాప్టర్లలో ముఖ్యమంత్రి వైఎస్ పార్దికకాయంతో పాటు పైలెట్లు, భద్రతా అధికారుల భౌతిక కాయాలను కర్నూలుకు తీసుకువచ్చారు. 3.00 : కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి. మధ్యాహ్నం 3.30 గంటల వరకు కర్నూలు రెండవ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో వైఎస్ భౌతిక కాయానికి శవపరీక్షలు జన నేతను చూసేందుకు నాలుగు గంటల పాటు నిరీక్షించిన అభిమానులు సాయంత్రం 4.30 గంటలకు కర్నూలు నుండి హైదరాబాద్‌కు బయలు దేరిన ప్రత్యేక హెలికాప్టర్‌లు వెక్కివెక్కి ఏడ్చిన నేతలు, అభిమానులు 5.00 : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ భౌతికకాయం. 5.30 : బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మృతదేహం తరలింపు. ఆ తర్వాత నేతల నివాళులు ప్రార౦భ౦..... |
0 comments:
Post a Comment