హైదరాబాద్: జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతితో ఆయన విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద ఏర్పాటు చేసేందుకోసం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో వైఎస్ విగ్రహాం రూపుదిద్దుకుంటుంది. విగ్రహ శిల్పి రాజ్ కుమార్ ఒడయార్ ఈ విగ్రహానికి రూపురేఖలు దిద్దే పనిలో నిమగ్నమయ్యారు. విగ్రహాల తయారీకి పెట్టింది పేరుగా... ఈ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ తన శిల్పకళానైపుణ్యంతో విగ్రహాలను రూపొందించడంలో నిష్ణాతుడు. జీవకళ ఉట్టిపడేలా విగ్రహాలను రూపొందిస్తాడనే పేరుంది. కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆర్ఢర్ ప్రకారం ఇడుపులపాయలో ప్రతిష్టించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆయన తయారుచేస్తున్నారు. ఓ వైపు ఆయన చనిపోయారనే బాధలో ఉన్నా, ఆయనను సజీవంగా ఉన్నట్లుగా విగ్రహ రూపంలో చూపించాలని తాను తపన పడుతున్నట్లు రాజ్‌కుమార్ చెబుతున్నాడు. వైఎస్ మరణంతో యావత్ రాష్ట్ర ప్రజానీకం వివిధ రీతుల్లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. చాలామంది అభిమానులు ఆయన విగ్రహాలను నెలకొల్పాలని భావిస్తున్నారు. దీంతో ఆయన విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొత్తపేటలోని శిల్పి రాజ్‌కుమార్ కు ఇప్పటికే చాలా ఆర్డర్లు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఆయన మాత్రం ఇడుపులపాయలో నెలకొల్పబోయే వైఎస్ విగ్రహాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. |
0 comments:
Post a Comment